వీసా పొందడంలో మూడుసార్లు విఫలం.. నేడు ట్రిలియన్ డాలర్ల కంపెనీ సొంతం!

  • ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువను దాటిన సెమీకండక్టర్ దిగ్గజం మైక్రాన్
  • స్ఫూర్తిదాయక ప్రస్థానంతో వార్తల్లో నిలిచిన భారత సంతతి సీఈఓ సంజయ్ మెహ్రోత్రా
  • యువకుడిగా మూడుసార్లు అమెరికా వీసా తిరస్కరణకు గురైన వైనం
  • తండ్రి పట్టుదలతో వీసా పొంది సిలికాన్ వ్యాలీలో అద్భుతాలు సృష్టించిన సంజయ్ 
  • ఏఐ టెక్నాలజీకి పెరిగిన డిమాండ్‌తో మైక్రాన్ షేర్లు రికార్డు స్థాయికి
ప్రపంచ సెమీకండక్టర్ రంగంలో మరో సంచలనం నమోదైంది. ప్రముఖ మెమరీ చిప్ తయారీ సంస్థ మైక్రాన్ టెక్నాలజీ, ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్‌ను అధిగమించి చరిత్ర సృష్టించింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సృష్టిస్తున్న ప్రభంజనంతో కంపెనీ షేర్లు రికార్డు స్థాయికి చేరగా, ఈ విజయం వెనుక ఉన్న భారత సంతతి సీఈఓ సంజయ్ మెహ్రోత్రా ప్రస్థానం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

తండ్రి చొరవే సంజయ్ విజయానికి పునాది
కాన్పూర్‌లో పుట్టి పెరిగిన సంజయ్ మెహ్రోత్రా, సిలికాన్ వ్యాలీ శిఖరాలను అధిరోహించడానికి ముందు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఆయన అమెరికా ప్రయాణమే ఒక దశలో ఆగిపోయేలా కనిపించింది. కంప్యూటర్ హిస్టరీ మ్యూజియానికి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మెహ్రోత్రా పంచుకున్న వివరాల ప్రకారం 1976లో ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో ఆయనకు మూడుసార్లు స్టూడెంట్ వీసా తిరస్కరణకు గురైంది. కాలిఫోర్నియా యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించాలన్న ఆయన కలకు ఇది పెద్ద అడ్డంకిగా మారింది.

నిరాశతో వెనుదిరగడానికి సిద్ధపడిన సంజయ్‌ను చూసి, ఆయన తండ్రి మాత్రం పట్టు వదల్లేదు. నేరుగా అమెరికన్ కాన్సుల్ కార్యాలయంలోకి వెళ్లి, తన కొడుకు ప్రతిభ గురించి, అతని చదువు ఆకాంక్ష గురించి గట్టిగా వాదించారు. ఆ 20 నిమిషాల సమావేశం సంజయ్ భవిష్యత్తును మార్చేసింది. కాన్సుల్ అధికారి మెత్తబడి వీసా మంజూరు చేయడంతో ఆయన అమెరికా ప్రయాణానికి మార్గం సుగమమైంది. తన తండ్రి చూపిన ఆ పట్టుదలే తన కెరీర్‌కు పునాది అని సంజయ్ తరచూ చెబుతుంటారు.

అమెరికా వెళ్లాక, బర్క్‌లీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేసిన మెహ్రోత్రా, 1988లో శాన్‌డిస్క్ (SanDisk) కంపెనీని ఎలీ హరారీ, జాక్ యువాన్‌లతో కలిసి స్థాపించారు. ఫ్లాష్ మెమొరీ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిన ఈ సంస్థ, 2016లో సుమారు 16 బిలియ‌న్ డాల‌ర్ల‌ డీల్‌తో వెస్ట్రన్ డిజిటల్‌లో విలీనమైంది. ఫోర్బ్స్ కథనం ప్రకారం ఆ తర్వాత ఏడాది, అంటే 2017లో సంజయ్ మెహ్రోత్రా మైక్రాన్ టెక్నాలజీ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. అప్పుడు కంపెనీ షేరు విలువ కేవలం 30 డాలర్లు.

ఏఐ ప్రభంజనం.. ట్రిలియన్ డాలర్ల క్లబ్‌లో మైక్రాన్ టెక్నాలజీ 
ఆయన నాయకత్వంలో ఏఐ, డేటా సెంటర్ల నుంచి మెమరీ చిప్స్‌కు విపరీతమైన డిమాండ్ రావడంతో మైక్రాన్ అప్రతిహత వృద్ధిని నమోదు చేసింది. ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ ట్రిలియన్ డాలర్ల మైలురాయిని దాటింది. ఒకప్పుడు వీసా కోసం తిప్పలు పడిన యువకుడు, నేడు ప్రపంచంలోని అత్యంత విలువైన టెక్నాలజీ కంపెనీలలో ఒకదానికి నాయకత్వం వహించడం ఎందరికో స్ఫూర్తినిస్తోంది.

Sanjay Mehrotra
Micron Technology
memory chips
artificial intelligence
AI
SanDisk
semiconductor industry
Indian CEO
Silicon Valley
technology company

More Telugu News